సిరివెన్నెల గారికి కన్నీటి వీడ్కోలు

నేను అత్యంత అభిమానించే గీత రచయిత, గొప్ప కవి, మహా మేధావి, పెద్ద మనసున్న మనిషీ అయిన మా గురువు గారు సిరివెన్నెల ఈ రోజు మమ్ము విడిచి వెళ్ళిపోయారు. కార్తీక బహుళ ఏకాదశి నాడు శివైక్యం పొందారు. ఇది గొప్ప విషాదమూ, తట్టుకోలేని నిజమే అయినా ఆయన పాటలనే తలుచుని ఓదార్పు పొందాల్సిన పరిస్థితి.

ఒక సూర్యుడు అస్తమించాడు
కాదు కాదు
ఆ సూర్యుడు శివజ్యోతిగా నిత్యం వెలుగుతూనే ఉంటాడు
దర్శనం చాలించాడు అంతే
సిరివెన్నెల కురుస్తూనే ఉంటుంది!
ఎన్నో ఇచ్చిన గురువు గారికి
సహస్ర పాదాభివందనాలు
కన్నీటి ప్రణామాలు

ఈ బాధలో నాలోంచి దొర్లిన కొన్ని అక్షరాలు ఇవి:

గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా…

అభిమానమనే దారంతో 
మా గుండెలకి గట్టిగా కట్టి పట్టుకున్నాక
ఎంత గగన విహారం చేస్తున్నా
ఎక్కడికి ఎగిరిపోగలరు మీరు గురువు గారూ!

మా బ్రతుకు గుడిలో మిమ్ము ప్రతిష్టించుకుని
ఆరాధనా దీపాలతో పూజించుకుంటున్నాం
ఇప్పుడు దివ్యధామంలో మీకు ఆకాశ దీపార్చన! 
అంతే కదా! 
అప్పుడూ ఇప్పుడూ మీరు మా దేవుడే! 

ఏ యోగమనుకోము మీతో వియోగం…

మీ పరిచయ భాగ్యం
జీవితంలో దొరికిన సత్సంగం, మహాయోగం
ఇప్పుడు మీ వియోగం
విషాదయోగమే అనుకోవాలా?
ఏమనుకున్నా ఆ విషాదాన్ని తుడిచి
దిశానిర్దేశం చేసే గీతావాక్యమూ మీదే!
నవ్వినా ఏడ్చినా మీ పాటలే వస్తాయి!

నోరార పిలిచినా పలకని వాడినా…

గొప్ప పాటలు రాసిన కవి మీరు
గొప్ప మనసున్న మనిషి మీరు
మీ మథనమంతా 
మనిషి శ్రేయస్సుకై పడిన తాపత్రయం
మీ కవనమంతా 
ప్రేమతో మాకు రాసిచ్చిన బ్రతుకు ఉత్తరం 

గురువు గారూ అని ఓ సారి పిలిస్తే
ఆ మాట వద్దు, మావయ్యా అనో బాబయ్యా అనో అనమన్నారు
ఎప్పుడూ అలా అనలేకపోయినా 
ఇప్పుడలా పిలిస్తే వెనక్కి వస్తావా మావయ్యా?

ఆనతి నీయరా హరా! సన్నుతి చేయగా, సన్నిధి చేరగా…

ఎందుకంత ఆర్తిగా మీరు శివగానం చేశారు గురువు గారూ?
ఎందుకు మీ పాటల పంచామృతంతో శంకరుని అభిషేకించారు?
అంతటి మహాశివుడూ మీ పదార్చనకు కరిగిపోయాడు!
ఏ వంక లేని మీ వంక తన కడగంటి చూపు వెయ్యనే వేశాడు! 

తొందరగా తన దగ్గరకు తీసుకెళ్లిపోయాడు!

మీరూ వారూ కైలాసంలో చల్లగా
మేమీ విషాదంలో జ్వలిస్తూనా?
అన్యాయం గురువు గారూ!
చాలా అన్యాయం!

Comments

Leave a comment

Blog at WordPress.com.