అహో ఒక పాటకు నేడే పుట్టినరోజు!

ఈ రోజు (మే 20) గురువుగారు సిరివెన్నెల గారి పుట్టినరోజు. 2010 లో ఆయన పుట్టినరోజుకి ఓ పాట రాశాను. అంతకంటే ముందు “అల్లరి ప్రియుడు” చిత్రానికి గురువుగారు రాసిన పాప్యులర్ గీతం – “అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు” ట్యూన్ కి ఒక పాట మొదలుపెట్టి ఆపేశాను. ఆ పాట ఈ మధ్య కనపడ్డంతో నాకు ఈ 2018 పుట్టినరోజుకి పూర్తిచేద్దాం అనే బుద్ధి పుట్టింది. సత్సంకల్పమే! కానీ నాకు అట్టే సమయం లేదు. ఎలాగో కష్టపడి నాకు గుర్తున్న ట్యూన్ కి రాసి ఈ ఉదయమే పూర్తి చేశాను. తీరా పాట వింటూ లిరిక్ ఫిటింగ్ సరిచూసుకుంటుంటే తెలిసింది ఈ పాట ఎంత క్లిష్టమైనదో. ట్యూన్ నడక చాలా వేగంగా ఉంటుంది, శ్రుతి పైస్థాయికి పోతుంది, పాడేవాడికి ఊపిరి తీసుకునే సమయమే ఉండదు. ఇక ఈ ట్యూన్ నడకకి పదాలు పొదగడం కూడా సవాలే! నేను అనుకున్న ట్యూన్ తో అసలు ట్యూన్ ని పోల్చిచూస్తే చాలా చోట్ల మార్పులు చెయ్యాల్సి వచ్చింది. ఇంత చేసినా ఒక 90% ఫిట్ అయ్యింది, అంతే! కానీ గురువుగారు 100% ఫిట్ అయ్యేటట్టు రాశారంటే అది ఆయన అసామాన్య ప్రతిభ, పర్ఫెక్షన్ కై ఆయన పడే కష్టం! ఇలా ఈ పాట రాసే ప్రయత్నంలో గురువుగారి గొప్పతనం మరోసారి తెలిసొచ్చింది. ఆయన రాసిన ఆణిముత్యం లాంటి పాట ముందు నా పాట తేలిపోతున్నా, ఈ గరికపువ్వు లాంటి పాటను భక్తితో ఆయనకు సమర్పించే సాహసం చేస్తున్నాను!

2010 లో నేను రాసిన పాటను గురువు గారి వద్దకు చేర్చి ఆయన ప్రశంసలు నాకందేందుకు కారణమైన విజయసారధి గారిని ఈ పాట పాడమని కోరాను. అడిగిన వెంటనే కాదనకుండా,  ఆయనకి సమయం లేకపోయినా సరే, నా కోసం ఈ కష్టమైన పాటని పాడి పంపించారు. వారికి ధన్యవాదాలు.

సిరివెన్నెల గారికి జన్మదిన శుభాకాంక్షలు!

పాట:

అహో ఒక పాటకు నేడే పుట్టినరోజు!
అహో సిరివెన్నెల కాసే చల్లనిరోజు!
ఇదే…ఇదే…
ప్రభాత భానుగీతిక
అఖండ జ్ఞానదీపిక
జనించు రోజు!

1. తియ్యని మాటల గాలమిది
మనసును దోచే జాలమిది
మల్లెల వానలు కురిపించే చల్లని కవితా మేఘమిదీ

అమ్మకు అమృత వాక్యమిది
ప్రేమకు నూతన భాష్యమిది
అనుబంధాలను నేర్పించే కమ్మని మమతల పాఠమిదీ

తేనెల తేటల మాటలతో
తెలుగున తీపిని తెలిపేది
సాహిత్యంలో విలువలనీ
సామాన్యులకీ పంచేది

బాధను కూడా నవ్వించి
చీకటినైనా వెలిగించి
ఎదంత ఆశ నిండగా
ఎండైన నీకు పండగ
పదా అనేది!

2. నిద్దుర లేపే గీత ఇది
నిగ్గదీసేటి దమ్ము ఇది
నిస్తేజాలను ప్రశ్నించే సత్యాన్వేషణ మార్గమిది!

తాత్విక కవితా చింతనిది
భావగంగకై తపము ఇది
నింగిన మెరిసే చుక్కలని నేలకు దింపే నేర్పు ఇదీ!

వెన్నెలలాగ కనిపించే
మేధోమథనం ఈ జ్వలనం!
సెలయేరల్లే కనబడినా 
లోతే దొరకని ఓ సంద్రం!

తెలివికి మనసును చూపేది
మనసును మనిషికి కలిపేది
మనం మనం మమేకమై
జగం ఒకే కుటుంబమై
మనాలనేది!

 

 

 


Comments

One response to “అహో ఒక పాటకు నేడే పుట్టినరోజు!”

  1. […] పదేళ్ళ క్రితం మొదలుపెట్టిన ఆయనపై పాటని పూర్తిచేయడం తప్ప ఈ పన్నెండేళ్లలో […]

    Like

Leave a comment

Blog at WordPress.com.